సరిహద్దుల్లో నేను నిరాహార దీక్ష చేస్తా!
న్యూఢిల్లీ: సంచలన వ్యాఖ్యలు చేసే ఫ్రైర్‌బ్రాండ్ నాయకురాలు, కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి కావేరి నదీ జలాల వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావేరి జలాల విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే.. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో తాను నిరాహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు.
ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్న కావేరి జలాల ప్రతిష్టంభనను తొలగించేందుకు ఆమె గురువారం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కావేరి జలాల సమస్య పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. తమిళనాడుకు తాజాగా కావేరి జలాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం.. ఆ తీర్పును ధిక్కరిస్తూ కర్ణాటక జలాలు విడుదల చేయకపోవడం తెలిసిందే.
కావేరి నదీ జలాల లభ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కర్ణాటకను తమ మంత్రిత్వశాఖను కోరిందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. సమస్య పరిష్కారానికి రెండు రాష్ట్రాలు చొరవ చూపుతున్నాయని, ఈ సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తామని ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసి కూచొని కోర్టు బయటే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని తాను కోరానని ఆమె చెప్పారు.