సాక్షి, చెన్నై: కావేరి జలాల పంపిణీ వివాదం మళ్లీ సుప్రీంకోర్టులో పడింది. తమిళనాడు - కర్ణాటకల మధ్య ఢిల్లీ వేదికగా సాగిన చర్చలు విఫలం అయ్యాయి. నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్న పాత పాటనే కర్ణాటక కొనసాగించడం, నీళ్లు ఇవ్వాల్సిందేనని తమిళనాడు పట్టుబట్టడం వెరసి కేంద్ర మంత్రి ఉమాభారతి నేతత్వంలో సాగిన చర్చలు అసంతృప్తికరంగా ముగిశాయి. ఈ చర్చల నివేదికను సుప్రీంకోర్టుకు పంపనున్నట్టు ఉమాభారతి ప్రకటించారు.
ఇక, సుప్రీం కోర్టు తమకు దిక్కు కావడం, ఎలాంటి ఉత్తర్వులు వెలువడుతుందో అన్న ఉత్కంఠ తమిళనాట బయలు దేరింది. తమిళనాడు - కర్ణాటకల మధ్య సాగుతూ వచ్చిన కావేరి జల వివాదం ఇరు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ ను రేపుతూ వస్తున్నది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వంలో కర్ణాటకతో చర్చల సంపద్రింపులకు అమ్మ జయలలిత ప్రభుత్వం సిద్ధం అయింది. కొన్నేళ్ల అనంతరం ఇరు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య సంప్రదింపుల చర్చ సాగనున్నడంతో ప్రాధాన్యత చోటు చేసుకుంది
సీఎం జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, తన దూతగా ప్రజా పనుల శాఖ మంత్రి ఎడపాడి పళని స్వామిని ఢిల్లీకి గురువారం పంపించారు. ఆయన వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, ప్రజా పనుల శాఖ కార్యదర్శి ప్రభాకర్, కావేరి టెక్నికల్ సెల్ చైర్మన్ ఆర్ సుబ్రమణియన్ చర్చలకు వెళ్లారు. ఈ సంప్రదింపులు ఫలితాన్ని ఇస్తుందా అన్న ప్రశ్న బయలు దేరినా, ముందుగా ప్రకటించిన మేరకు ఈ సమావేశంలో కర్ణాటక పాత పాటనే కొనసాగించడం గమనార్హం.
స్నేహ హస్తంతో : ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమా భారతి మధ్యవర్తిగా ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ప్రారంభం అయింది. సంప్రదింపులకు ముందు ఆసక్తికర సంఘటనలు ఆ సమావేశ మందిరంలో చోటు చేసుకున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమాభారతికి పుష్ప గుచ్చం అందించడం, అదే సమయంలో తమిళ మంత్రి ఎడపాడి పళని స్వామిని ఆమె ప్రత్యేకంగా ఆహ్వానించారు. కర్ణాటక-తమిళనాడుల మధ్య సాగుతున్న నీటి యుద్ధాన్ని తాను కొలిక్కి తీసుకొస్తా..! అన్నట్టుగా .. అటు సీఎం సిద్ధరామయ్య, ఇటు మంత్రి ఎడపాడిల చేతుల్ని కలుపుతూ స్నేహ పూర్వక పలకరింపుకు ఉమాభారతి చర్యలు తీసుకున్నారు.
స్నేహ హస్తంతో , తమిళ మంత్రికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉమాభారతి చర్యలు తొలుత ఉన్నా, చివరకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడు ప్రతినిధులు వ్యతిరేకించడం విశేషం. నీళ్లు ఇవ్వబోమంటూ పదే పదే పాత పాటను కర్ణాటక సీఎం సాగించడం, నీటి కోసం తమిళనాడు పట్టుబడటం వంటి అంశాలతో గంటల కొద్ది చర్చ సాగినా, చివరకు అసంతృప్తికరంగా ముగియడం గమనార్హం. ఇక, నీటి నిల్వల పరిస్థితిపై పరిశీలనకు ఉమాభారతి ఓ కమిటీ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
సుప్రీమే దిక్కు : కావేరి జలాల విషయంలో ఆది నుంచి సుప్రీం కోర్టు తమిళనాడుకు అండగా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ బంతి సుప్రీం కోర్టులో పడింది. చర్చలు అసంతృప్తికరంగా ముగియడంతో, ఈ చర్చల నివేదికను సుప్రీం కోర్టుకు పంపించనున్నట్టు ఉమాభారతి ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా, కోర్టు ఉత్తర్వుల్ని పదే పదే దిక్కరిస్తూ ముందుకు సాగుతున్న కర్ణాటక సర్కారుపై ఈ సారి సుప్రీం కోర్టు చర్యలు తీసుకుంటుందా...? తమకు న్యాయం చేకూరే విధంగా నీటిని విడుదల చేయిస్తుందా..? అన్న ఎదురు చూపులు రాష్ట్రంలో పెరిగాయి.
అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు ఢిల్లీ వేదికగా చేసిన ప్రసంగంలో పదే పదే సుప్రీం కోర్టు తమకు అండగా నిలిచిందని వ్యాఖ్యానించడం విశేషం. కర్ణాటక నిరాకరించినా, కేంద్రం చేతులు ఎత్తేసినా, తమను సుప్రీం కోర్టు ఆదుకుందని, పదే పదే ఆ కోర్టు ఆదేశాలు , ఉత్తర్వుల్ని బేఖాతరు చేయడమే కాకుండా, రాజకీయ శాసనాల ఉల్లంఘనకు పాల్పడటం మంచి పద్దతి కాదని కర్ణాటక ప్రభుత్వాన్ని హెచ్చరించి ఉన్నారు.
రాష్ట్రల మధ్య ప్రవహించే నదులపై ఆయా రాష్ట్రాలకు హక్కులు ఉంటాయన్న విషయాన్ని మరచి, సర్వాధికారం తమదే అన్నట్టుగా కర్ణాటక వ్యవహరించడటాన్ని తప్పుబడుతూ, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను వివరించడం గమనార్హం. ఈ సారి కూడా తమకు సుప్రీం కోర్టు అండగా నిలుస్తుందన్న నమ్మకం ఉన్నా, ఆ ఉత్తర్వుల్ని ఉల్లంఘించడమే పరిపాటిగా కర్ణాటక ముందుకు సాగుతుండ డాన్ని తమిళులు జీర్ణించుకోలేకున్నారు.కాగా, ఈ జల వివాదం తమిళనాట అన్ని రంగాల మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. వస్త్రాల ఎగుమతి ఆగి ఉండటం, లారీలు ఎక్కడిక్కడ ఆగడం, రోజా పువ్వుల ఎగుమతి తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటుండడంతో, పరిస్థితి ఎప్పుడు కుదుట పడుతుందో అని వర్తకులు ఎదురు చూపుల్లో ఉన్నారు.
ఇక సుప్రీం దిక్కు
Published Fri, Sep 30 2016 1:45 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM
Advertisement
Advertisement