అయోధ్య కోసం ఉరిశిక్షకైనా సిద్ధం: ఉమ
ఉమ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర మంత్రి ఉమాభారతి ఘాటుగా స్పందించారు. ‘రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. ఇందుకోసం పశ్చాత్తాప పడను. ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. అయోధ్య కోసం ఉరిశిక్షకైనా నేను సిద్ధం’ అని ఉమాభారతి స్పష్టం చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో కుట్రేమీ లేదని.. అంతా బహిరంగంగానే జరిగినందున రాజీనామా చేసే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఈ దేశం గంగానది, త్రివర్ణ పతాకం, ఆవు, రాముడిదని వీటికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆమె తెలిపారు. రాముడి దర్శనం కోసం అయోధ్య వెళ్లాలనుకున్నా అర్ధంతరంగా తన పర్యటనను ఆమె రద్దుచేసుకున్నారు.
బుధవారం కోర్టు తీర్పు వెలువడగానే.. ఉమాభారతి మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. అటు ఉమాభారతి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరోవైపు, కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర సీనియర్ మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, వెంకయ్య నాయుడుతోపాటు పలువురు సీనియర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు, కోర్టు తీర్పును పూర్తిగా చదివాకే స్పందిస్తామని బీజేపీ స్పష్టం చేసింది.