బాబ్రీ షాక్ | Advani and Uma Bharti and Joshi will face trail in Babri case | Sakshi
Sakshi News home page

బాబ్రీ షాక్

Published Thu, Apr 20 2017 1:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

బాబ్రీ షాక్ - Sakshi

బాబ్రీ షాక్

అడ్వాణీ, జోషి, ఉమాభారతిలకు ఎదురుదెబ్బ  
వారిపై నేరపూరిత కుట్ర అభియోగాల పునరుద్ధరణ
సీబీఐ పిటిషన్‌కు అనుమతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
వారు బాబ్రీ కేసులో విచారణ ఎదుర్కోవాలని సుప్రీం తీర్పు
లక్నోలోని ట్రయల్‌ కోర్టులో రోజువారీ విచారణ
రెండేళ్ల కాలపరిమితితో కేసు విచారణ పూర్తి చేయాలి
అప్పటివరకూ ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తిని బదిలీ చేయరాదు
రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉన్నందున కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు

పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనపై విచారణ


న్యూఢిల్లీ
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1992 నాటి ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీమనోహర్‌ జోషి, ఉమాభారతిపై నేరపూరిత కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. బాబ్రీ కూల్చి వేతకు వీరు కుట్రపన్నారన్న ఆభియోగాలపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్ణీత కాలపరిమితితో జరిగే విచారణను అడ్వాణీ, జోషి, ఉమ ఎదుర్కోవాలంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో ముందున్న అడ్వాణీతో పాటు 21 మందిపై కుట్ర అభియోగాలను కొట్టేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ.. వారిపై కుట్ర అభియోగాలను పునరుద్ధరించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను.. జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం స్వీకరించింది.

కేసుపై రోజువారీ విచారణ
లక్నోలోని ట్రయల్‌ కోర్టులో ఈ కేసుపై రోజువారీగా విచారణ జరుగుతుందని, తమ తీర్పు అందిన తర్వాత రెండేళ్ల నిర్ణీత కాలపరిమితిలో కేసు విచారణ ముగించా లని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ‘‘అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించాం. దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు సైతం జారీ చేశాం’’అని ధర్మాసనం పేర్కొంది. రాయ్‌బరేలీ, లక్నో ట్రయల్‌ కోర్టుల్లో వేర్వేరుగా బాబ్రీ కేసుల విచారణ కొనసాగుతోందని, ఇకపై వీటన్నింటినీ కలిపి లక్నోలోని ట్రయ ల్‌ కోర్టులో ఉమ్మడి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద కేసులో కొత్తగా విచారణను ప్రారంభించడంలేదని స్పష్టం చేసింది. లక్నో ట్రయల్‌ కోర్టు న్యాయమూర్తిని విచారణ పూరై్త.. తీర్పు వెలువరించే వరకూ బదిలీ చేయరాదని ఆదేశించింది. సరైన కారణం చూపించకుండా ఏ పార్టీ ఈ కేసు వాయిదా కోరేందుకు అవకాశం లేదని, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి సంబంధిత కారణాలపై సంతృప్తి చెందితేనే కేసు విచారణ వాయిదా వేయాలని సూచించింది.

కల్యాణ్‌సింగ్‌కు మినహాయింపు..
రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్‌సింగ్‌కు రాజ్యాంగ పరమైన రక్షణ ఉన్నందున ఆయనకు మినహాయింపు లభించింది. గవర్నర్‌ పదవీకాలం ముగిసిన తర్వాత కల్యాణ్‌సింగ్‌పై సెషన్స్‌ కోర్టు విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో కల్యాణ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే. 25 ఏళ్లుగా కేసు విచారణ జాప్యం కావడానికి సంబంధించి సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాసిక్యూషన్‌ సాకు‡్ష్యల నుంచి వాంగ్మూలాల నమోదు కోసం రోజువారీగా కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో ట్రయల్‌ కోర్టు కేసు విచారణను ప్రారంభించాలని స్పష్టం చేసింది.

ఉమ్మడిగా కేసుల విచారణ..
‘‘క్రైమ్‌ నంబర్‌ 198/92(అడ్వాణీ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా)లో విచారణను రాయ్‌బరేలీలోని స్పెషల్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి లక్నోలోని అదనపు సెషన్స్‌ కోర్టు(అయోధ్య వ్యవహారాలు) న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నాం’’అని ధర్మాసనం స్పష్టం చేసింది. అడ్వాణీ, జోషి, ఉమాభారతితో పాటు వినయ్‌ కతియార్, సాధ్వీ రీతంబర, విష్ణుహరి దాల్మియాలపై రాయ్‌బరేలీ కోర్టులో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అడ్వాణీ, జోషీ తరపున కోర్టుకు హాజరైన సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌.. కేసుల బదిలీ, ఉమ్మడి విచారణ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అయితే అడ్వాణీ తరపు న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సతీష్‌ప్రదాన్, సీఆర్‌ బన్సల్, ధర్మ్‌దాస్, మహంత్‌ నృత్యగోపాల్‌దాస్, మహామండలేశ్వర్‌ జగదీశ్‌ ముని, ఆర్‌వీ వేదాంతి, బీఎల్‌ శర్మ, సతీశ్‌చంద్రనగర్‌ తదితరులపై కూడా సెషన్స్‌ కోర్టు 120బీ కింద అభియోగాలు నమోదు చేస్తుందని స్పష్టం చేసింది. వీవీఐపీలపై కొత్తగా ఎటువంటి అభియోగాలు నమోదు చేయడం లేదని, గతంలో నమోదు చేసిన నేరపూరిత కుట్ర అభియోగాలనే పునరుద్ధరించాలని మాత్రమే తాము కోరుతున్నామని సీబీఐ స్పష్టం చేసింది.

రెండు కోర్టుల్లో విచారణ
1992 డిసెంబర్‌ 6 నాటి బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి రెండు సెట్ల కేసుల విచారణ వేర్వేరు కోర్టుల్లో కొనసాగుతోంది. మొదటిదానిలో గుర్తించని కరసేవలకుపై నమోదైన కేసు విచారణ లక్నో కోర్టులో జరుగుతోంది. పలువురు భాజపా నేతల ప్రమేయం ఉన్న కేసు విచారణ రాయ్‌బరేలి కోర్టులో కొనసాగుతోంది. సీబీఐ చార్జిషీట్‌లో అడ్వాణీతో పాటు 20 మందిపై భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్లు 153ఏ(వర్గాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించడం), 153బీ(జాతీయ సమగ్రతను దెబ్బతీయడం), 505(తప్పడు ప్రకటనలతో పుకార్లను సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గించడం) కింద అభియోగాలు నమోదు చేసింది. 120బీ(నేరపూరిత కుట్ర) కింద కూడా అభియోగాలు నమోదు చేసింది. అయితే దీనిని ప్రత్యేక న్యాయస్థానం కొట్టేసింది. 2010 మే 20న అలహాబాద్‌ హైకోర్టు ఈ తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ హజీ మహబూబ్‌ అహ్మద్‌(ప్రస్తుతం జీవించిలేరు), సీబీఐ సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement