సుప్రీంకోర్టులో అద్వానీకి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానితో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కనపెట్టిన సుప్రీంకోర్టు, రెండేళ్లలో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. బాబ్రీ కేసు 25ఏళ్లు పెండింగ్‌లో ఉండటం న్యాయాన్ని నిరాకరించడమే అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అందుకే రోజువారీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులు చాలామంది మరణించారని, మరికొంతమంది జీవిత చరమాంకంలో ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.
రాయ్‌బరేలి కోర్టు నుంచి విచారణను లక్నో ట్రయిల్ కోర్టు బదిలీకి అనుమతి ఇస్తూ రోజువారి విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు విచారణ పూర్తయ్యేవరకూ జడ్జిలను బదిలీ చేయరాదని సూచించింది. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో అద్వానీ, జోషీలతో పాటు కేంద్ర మంత్రి ఉమా భారతి, వినయ్ కటియార్, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. అయితే కల్యాణ్ సింగ్‌కు మాత్రం తాత్కాలిక ఊరట లభించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నందున తర్వాత విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు సూచనలు చేసింది.
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. కర సేవకులపైన ఒక కేసు, మసీదు కూల్చివేతకు ప్రేరేపించారని నాయకులపై మరో కేసు నమోదు చేశారు. 2010లో ఈ కేసులో బీజేపీ నేతలను నిర్దోషులుగా రాయబరేలి కోర్టు ప్రకటించింది. అలహాబాద్ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. దీంతో సీబీఐ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.