భావచౌర్యాన్ని కట్టడి చేసేందుకు యూజీసీ కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించింది.
న్యూఢిల్లీ: భావచౌర్యాన్ని కట్టడి చేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా విధానాన్ని రూపొందించింది. విద్యార్థులు బాధ్యతగా కొత్త అధ్యయనాలు చేసేందుకు, కాపీ కొట్టకుండా పరిశోధనా వ్యాసాలు రాసేందుకు ఈ చర్య దోహదపడనుంది. ఒకే తరహా వ్యాసాలను గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ముసాయిదా పేర్కొంది.
ఇతరుల వ్యాసాలను కాపీ కొట్టకుండా, అంతగా అవసరమైతే మూల వ్యాసం రాసిన వారి అనుమతి తీసుకుని ఆ సమాచారాన్ని వాడుకునేలా విద్యార్థులు, ఉపాధ్యాయులకు కళాశాలల యాజమాన్యాలు సూచనలివ్వాలనే నిబంధన ముసాయిదాలో ఉంది. పరిశోధన సాగించడం, ప్రాజెక్టు వర్కు పూర్తి చేయడం, వ్యాసాలు రాయడం తదితర అంశాలపై కళాశాలలు అవగాహాన సదస్సులు నిర్వహించాలని ముసాయిదా పేర్కొంటుంది.