పాకిస్థాన్ కు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ సమన్లు జారీ చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ భూభాగంలో సాగుతున్న చర్యలను వెంటనే ఆపాలని ఆయన పాక్ ను డిమాండ్ చేశారు. పాకిస్థాన్ హైకమిషనర్ ను ప్రధాన మంత్రి నివాసానికి ఆహ్వానించి ఆయనతో చర్చలు జరిపారు. ఆ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, నితిన్ గడ్కారీ లు హాజరయ్యారు.
ఉరి ఘటనలో ఉగ్రవాదులు ఉపయోగించిన గన్ లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలపై పాకిస్థాన్ గుర్తులున్నాయని, వాటి ఆధారాలను బాసిత్ కు అందించారు. ఈ విషయాన్ని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బాసిత్ కు తెలిపారు. పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్ పాక్ కు స్పష్టం చేసిందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.