పాక్ సిద్ధమే.. భారత్ సిద్ధమేనా: షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
భారత్-పాక్ మధ్య అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణమని షరీష్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచన మేరకు భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణలను మరోసారి కొట్టిపారేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ) వద్ద పాక్ ఎలాంటి చొరబాట్లకు యత్నించలేదన్నారు. ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.