లోక్‌సభలో యోగి చివరి ప్రసంగమిదే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్లమెంటులో తన చివరి ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. మోదీ ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా మారారని కొనియాడారు. ప్రపంచం మొత్తం మోదీనే గమనిస్తుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. లోక్‌సభ సభ్యుడు అయిన ఆదిత్యనాథ్ ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. దీంతో మంగళవారం ఢిల్లీకి వచ్చి అమాత్యులను కలిసిన ఆయన చివరి ప్రసంగంగా లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
'దేశ ఆర్థికాభివృద్ధి మోదీతోనే సాధ్యం. మోదీ చొరవవల్లే గోరఖ్‌పూర్‌కు ఎయిమ్స్ వచ్చింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రపంచం మోదీని గమనిస్తుంది. అభివృద్ధికి మతంతో సంబంధం లేదు. రెండున్నరేళ్లలోనే ఉత్తరప్రదేశ్‌కు మోదీ 2.30లక్షల కోట్లు ఇచ్చారు. గత 15 ఏళ్లలో ఇప్పటి వరకు గోరఖ్‌పూర్‌లో ఒక్క హింసాయుత ఘటన కూడా చోటుచేసుకోలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థికవృద్ధి రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ పార్లమెంటులో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను' అంటూ యోగి ప్రసంగించారు.