పిల్లల చదువుకై కిడ్నీ ’అమ్మ’కానికి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ తల్లి పిల్లల చదువు కోసం కిడ్నీ అమ్మకానికి సిద్దపడింది. యూపీలోని రోహత ప్రాంతానికి చెందిన ఆర్తీ అనే మహిళా తను కిడ్నీ అమ్మకానికి సిద్దమని బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై విలేకరులు సంప్రదించగా ఆమె బాధను వెల్లడించింది. నలుగురు పిల్లల చదువు ఫీజులు కట్టలేకపోతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్తీకి ముగ్గురు కూతురులు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు సీబీఎస్‌ఈ స్కూల్ లో చదువుతున్నారు. తన భర్తకు బట్టల షాప్ ఉండేదని, నోట్ల రద్దుతో వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది.
పిల్లల చదువు విషయంపై లోకల్ ప్రజాపతినిధులు కలిస్తే సహాయం చేయకపోగా.. మీ స్టేటస్ తగ్గట్లు చదివించుకోవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కూడా కలిసానని, సీఎం సహాయం చేస్తానని మాట ఇచ్చాడని కానీ ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంది. దీంతో చేసేదేమి లేక తన ఒక కిడ్నీని అమ్మకానికి పెట్టినట్లు ఆర్తీ తన బాధను వెల్లడించింది. టాక్సీ డ్రైవర్‌గా నెలకు రూ.5000 కు మించి సంపాదించలేక పోతున్నానని ఆమె భర్త మనోజ్ శర్మ తెలిపాడు.