
అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యం
ఓర్పు, నేర్పుల కలయికే తాజా కూర్పు: వెంకయ్య
- సమాచార శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి
- కొత్త, మారిన శాఖల మంత్రులు కూడా బాధ్యతల స్వీకరణ
- ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేయటమే లక్ష్యమని ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : అభివృద్ధి, సుపరిపాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. సమాచార, ప్రసార మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య.. కేంద్ర కేబినెట్‌లో జరిగిన మార్పుచేర్పులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. దేశాభివృద్ధిలో ప్రజాసమాచార వ్యవస్థ అతి ముఖ్యమైందని పేర్కొన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి సుపరిపాలనతో అభివృద్ధికి పెద్ద పీట వేసి, అందరినీ పురోగతిలో భాగస్వాములను చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలిస్తున్నాయి’ అని అన్నారు.
మంత్రివర్గంలో చేసిన మార్పులు చేర్పులు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. అనుభవం, నేర్పు, ఓర్పుతో కలిపి ప్రధాని కూర్పు చేశారన్నారు. ఈ మార్పులకు ప్రతిపక్షాల్లోని కొందరు నేతలు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. వెంకయ్య నాయుడు సమాచార మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార శాఖ సహాయ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.కొత్తగా మంత్రివర్గంలో చేరిన వారితోపాటు శాఖలు మారిన పలువురు మంత్రులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
మానవ వనరుల అభివృద్ధఙ శాఖ నుంచి చేనేత, జౌళి శాఖకు మారిన స్మృతి ఇరానీ కొత్త బాధ్యతలు తీసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని తగ్గించి చర్చలతో జడ్జీల నియామకంలో ఇరు వర్గాలకు ఆమోదయోగ్య నిర్ణయం వెలవడేలా ప్రయత్నిస్తానని కొత్త న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్న అనంత్ కుమార్ కీలకమైన బిల్లులను ఆమోదింపచేయటం తన ప్రధాన్యమ్నారు. విదేశాంగ సహాయ మంత్రిగా ఎంజే అక్బర్, పర్యావరణ, అటవీ మంత్రిగా అనిల్ దవే, రైల్వే శాఖ సహాయ మంత్రిగా రాజెన్ గొహైన్, ఆర్థిక సహాయ మంత్రులుగా సంతోశ్ గంగ్వార్, అర్జున్‌రామ్ మేఘ్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రైతులకు చేరువై.. వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషిచేస్తానని.. వ్యవసాయ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఎస్ అహ్లువాలియా తెలిపారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్పీఐ పార్టీ అధినేత రాందాస్ అఠావలే సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. దళితుల అభ్యున్నతే ప్రధాన లక్ష్యమన్నారు. కేబినెట్ హోదాకు పదోన్నతి పొంది మానవ వనరుల శాఖ బెర్త్ దక్కించుకున్న ప్రకాశ్ జవదేకర్ గురువారం బాధ్యతల చేపడతారు.
కుచ్‌తో లోగ్ కహేంగే: స్మృతి
చేనేత, జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాజీ మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. శాఖ మార్పునకు అమిత్‌షానే కారణమా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘వ్యక్తులు కాదు పార్టీ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. యూపీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకే శాఖ మార్చారన్న ఊహాగానాలకు హిందీ సినిమా పాట ‘కుచ్‌తో లోగ్ కహేంగే.. లోగోంకా కామ్ హై కహనా’(జనాలేమైనా అంటారు.. ఏదోటి అనటమే వారి పని) అని సమాధానమిచ్చారు.
నకిలీ ట్విటర్‌పై అనుప్రియ ఫిర్యాదు
ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని తన పేరుతో నకిలీ ట్విటర్ ఖాతా తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్య పార్టీల అంశం కాదు: జవదేకర్
విద్యా రంగం వివిధ పార్టీలు చేసే రాజకీయం కాదని.. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ‘విద్య జీవితంలో మార్పును, ఓ విలువను తీసుకొస్తుంది. ప్రస్తుతం విద్యారంగంలో నెలకొన్న ఆందోళనలు, నిరసనలకు చర్చల ద్వారా పరిష్కరించవచ్చని నేను నమ్ముతున్నాను. నేను కూడా ఇలాంటి ఆందోళనలు, విద్యార్థి రాజకీయాల నుంచే వచ్చాను. ఇకపై ఆందోళనలు అవసరం లేదు’ అని జవదేకర్ తెలిపారు. నూతన విద్యావిధానం రూపకల్పనలో అందరి అభిప్రాయాలను తీసుకుంటామని జవదేకర్ తెలిపారు.