
13న ఉప రాష్ట్రపతి పర్యటన
సాక్షి, హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెల 13న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉర్దూ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొదటి మహమ్మద్ కులీకుతుబ్‌షా స్మారక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఖరారైన షెడ్యూలు ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం ఉప రాష్ట్రపతి బేగంపేట చేరుకుంటారు. అక్కణ్నుంచి నేరుగా వర్సిటీకి చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి న్యూఢిల్లీకి బయల్దేరి వెళతారు. ఈ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. అవసరమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లు, వైద్య, ఆరోగ్య, సమాచార, పౌర సంబంధాలు, బీఎస్ ఎన్‌ఎల్, తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసులు తదితర శాఖల ద్వారా నిర్వహించే పనులను చేపట్టాలని సూచించారు. ఈ సమా వేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మున్సిపల్ కార్య దర్శి నవీన్ మిట్టల్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, సైబరా బాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.