
సాక్షి, న్యూఢిల్లీ : ఇది హృదయానికి అతుక్కునే దృశ్యం. స్నేహానికి కొత్త నిర్వచనం. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం ఏమీ తెలియని ఇద్దరు బాలమిత్రులు. ఏడాది పాటు కలిసి ఉన్నారు. ఒకరికొకరు విడిపోని ఆప్తులయ్యారు. విధివశాత్తు వారు కేవలం రెండేరెండు రోజులు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు ఒకరికొకరు చూసుకున్నప్పుడు, కలిసికున్నప్పుడు వారు పొందిన అనిర్వచనీయ ఆనందం అంతా ఇంతా కాదు. మనమందరం ముగ్ధులయ్యేంత. ఒకరికొకరు ఆనందంతో రెండు చేతులెత్తి, ఒకరి వద్దకు ఒకరు పరుగెత్తి, చేతులతో చుట్టుముట్టుకుని తన్మయత్వంతో కౌగిలించుకున్నారు. న్యూయార్క్ సిటీలోని ఓ రోడ్డు మీద గురువారం కనిపించిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అబ్బురపరుస్తోంది.
ఈ ఇద్దరు బాల మిత్రల వయస్సు రెండంటే రెండేళ్లే. వారిలో ఒకరి పేరు మాక్స్‌వెల్, మరొకరి పేరు ఫిన్నెగన్. మాక్స్‌వెల్ నాన్న మైఖేల్ సిసినరోస్ కథనం ప్రకారం రాత్రి పూట, నిద్ర వేళల్లో మినహా ఈ ఇద్దరు బాలలు ఒకరిని విడిచి ఒకరు ఉండరట. ఒకరికొకరు కొన్ని క్షణాలు కనిపించకపోతే ఒకరి గురించి ఒకరు వాకబు చేయడం మొదలు పెడతారట. అనకోకుండా మాక్స్‌వెల్ ఇంటికి సమీపంలోనే నివసించే ఫిన్నెగన్ రెండురోజుల పాటు, కచ్చితంగా చెప్పాలంటే తన తల్లిదండ్రులతోపాటు నగరంలో మరెక్కడికో వెళ్లాల్సి రావడంతో వారిద్దరు పిల్లల మధ్య ఎడబాటు చోటు చేసుకుంది. గురువారం నాడు వారిద్దరు కలుసుకున్నప్పుడు ‘స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం’ అన్న అనుభవం కలిగింది.
ఇద్దరు ఒక జాతికి చెందిన పిల్లలు కాకపోవడం మరీ విశేషం. ఒకరు శ్వేత జాతీయుడు, మరొకడు నల్లజాతీయుడు. ‘నిజమైన స్నేహానికి నిలువెత్తు నిర్వచనం. ఈ అమాయక బాలల మధ్య కనిపిస్తున్న అనిర్వచనీయ అనుబంధం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇలాంటి ఆనందాన్నే ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తే.. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఎన్నోసార్లు ఈ వీడియో చూసి పులకించి పోయాను’ అని ఓ ఫేస్‌బుక్ యూజర్ తైరా వితాని వ్యాఖ్యానించారు.
చదవండి: అర్థరాత్రి కారడవిలో 11 నెలల పాప ఒంటరిపోరాటం.. వైరల్
Comments
Please login to add a commentAdd a comment