లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా వ్యవహారంపై పార్లమెంటుఅట్టుడుకుతోంది.
న్యూఢిల్లీ: లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యా వ్యవహారంపై గురువారం పార్లమెంటులో దుమారం రేగింది. రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా తప్పించుకొని విదేశాలకు పారిపోవడంపై అటు లోక్సభలోను, ఇటు రాజ్యసభలోను ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు గులాం నబీ అజాద్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాల్యాను పట్టుకోలేకపోవడానికి ఆయన ఏమీ సూది కాదు కదా అని వ్యాఖ్యానించారు. కిలోమీటరు దూరం నుంచి కూడా ఆయన స్పష్టంగా కనపడతాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
విజయ్ మాల్యా దేశం విడిచిపోవడానికి కేంద్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మాల్యా పాస్పోర్టును సీజ్ చేసి, ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆజాద్ సూటిగా ప్రశ్నించారు. మరోవైపు గులాం ఆరోపణలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఫెమా చట్టం కింద మాల్యాపై కేసులు నమోదైనపుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందంటూ ఆజాద్ ఆరోపణలను తిప్పికొట్టారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని సభకు వివరించారు.
ఇదే అంశంపై అటు లోక్సభలో కూడా కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం సభ్యుడు రాజేష్ , పప్పు యాదవ్ లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు.