సాక్షి, న్యూఢిల్లీ : రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన 20 ఏళ్ళుగా లక్షలాది మంది రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. సర్వీసులో ఉండగా బ్యాంక్ ఉద్యోగుల నుంచి సేకరించిన మొత్తాలతో ఏర్పాటు చేసిన పెన్షన్ ఫండ్ నుంచి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
‘బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, అసోసియేషన్‌లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ పెన్షన్ ఫండ్ ఏర్పాటు జరిగింది. గడిచిన 20 ఏళ్ళుగా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ సవరణ జరగలేదు. దీని వలన ఒకే హోదాతో గతంలో రిటైరైన అయిన ఉద్యోగులకు ప్రస్తుతం రిటైరైన ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ మొత్తాల మధ్య గణనీయమైన వ్యత్యాసం చోటు చేసుకుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా 20 ఏళ్ళ క్రితం నిర్ణయించిన పెన్షన్ ఈరోజున ఏమూలకు సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుమారు 6 లక్షల మంది రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు బ్యాంకింగ్ రంగంలో పెన్షన్ల విధానాన్ని మార్చాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించడం జరిగింది. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే పెన్షన్ ఫండ్‌ను ఇండియన్ ట్రస్ట్ అధీనంలోకి తీసుకురావాలి. మెజార్టీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లను సంప్రదింపులకు అర్హులుగా గుర్తించాలి. రిజిస్టర్డ్ అసోసియేషన్లకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులను చట్టబద్దంగా ఏర్పాటు చేసే పెన్షన్ ఫండ్ ట్రస్టు బోర్డుల్లో ప్రతినిధులుగా చేర్చాలి. గతంలో రిటైరైన ఉద్యోగులు, ఇటీవల రిటైరైన ఉద్యోగులకు చెల్లించే పెన్షన్ల మధ్య సామీప్యత తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పునరుత్పాదక శక్తి రంగం ద్వారా 7 లక్షల ఉద్యోగాలు..
పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగం ద్వారా దేశంలో 7 లక్షల 19 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్నట్లు పునరుత్పాదక శక్తి శాఖ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించిన నివేదిక ప్రకారం 2018 నాటికి దేశంలో సోలార్ ఫొటో వాల్టిక్ రంగంలో ఒక లక్షా 15 వేల ఉద్యోగాలు, పవన విద్యుత్ రంగంలో 58 వేల ఉద్యోగాలు, జల విద్యుత్ రంగంలో 3 లక్షల 47 వేల ఉద్యోగాలు కల్పించవచ్చని అంచనా వేసిందన్నారు. దేశంలో 2022 నాటికి పునరుత్పాదక శక్తి రంగంలో 175 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 85.90 గిగావాట్ల పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్ధ్యాన్ని నెలకొల్పినట్లు మంత్రి చెప్పారు. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంలో ఇది 23 శాతం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
2030 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్
మలేరియా వ్యాధి నియంత్రణలో భారత్ కృషి ఫలిస్తోంది. 2016తో పోల్చుకుంటే మలేరియా కేసులలో 24 శాతం తగ్గుదల కనిపించగా 2017తో పోల్చుకుంటే 28 శాతం కేసులు తగ్గినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మలేరియా వ్యాధి నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల సహకారంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేసినట్లు చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మలేరియా నిర్మూలన కోసం ప్రారంభించిన వినూత్న కార్యక్రమాల ద్వారా 2030 నాటికి భారత్‌ను మలేరియా రహిత దేశంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment