ఆ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ వారి పనేనా!
లేహ్: ఇండియా, చైనా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఇటీవలి కాలంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ రాష్ట్రం లేహ్ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలకు ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్ రావడం గమనార్హం. వాస్తవాదీన రేఖ ప్రాంతంలోని డుర్బక్ గ్రామ సర్పంచ్కు ఇటీవల వచ్చిన ఓ ఫోన్ కాల్ను విచారించిన అధికారులు.. అది వెబ్ ఆధారిత కాల్గా నిర్థారించారు.
ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను డిప్యూటీ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు పరిచయం చేసుకొని, ఆర్మీకి సంబంధించిన వివరాలను అడిగాడు. అయితే ఆ సమయంలో ఆర్మీ క్యాంపులోనే ఉన్న సర్పంచ్ ఈ విషయాన్ని సమీపంలోని ఆర్మీ అధికారికి వివరించాడు. దీనిపై విచారణ జరపగా ఆ నంబర్కు సంబంధించిన వివరాలేవీ లభించలేదు. దీంతో అది పాకిస్తాన్ లేదా చైనా దేశాలకు చెందిన గూఢచారుల పనిగా అధికారులు భావిస్తున్నారు. బార్డర్ గ్రామాల్లోని కొందరు అమాయక ప్రజలు ఇలాంటి కాల్స్ రిసీవ్ చేసుకున్న సందర్భంలో ఆర్మీకి సంబంధించిన వివరాలను వెల్లడించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫోన్ చేసిన వ్యక్తులు ఎక్కువగా ఆ ప్రాంతంలో ఆర్మీ మోహరింపుకు సంబంధించిన వివరాలతో పాటు, అక్కడ గల రవాణా సౌకర్యాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ మిస్టీరియస్ ఫోన్ కాల్స్పై ఇప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల్లోని ప్రజలకు ఈ వ్యవహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు.