న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం మంగళవారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సరిహద్దులో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ చెలరేగింది. గాల్వాన్‌లోయ ప్రాంతంలో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగింది. సరిహద్దు వివాదంలో ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. మరికొంతమంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. చైనా సైనికులకూ కొందరికి గాయాలయ్యాయి. సరిహద్దులో చైనా చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా లదాఖ్ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య గతకొంత కాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, భారత్-చైనా సరిహద్దులో కాల్పులు జరగలేదని, ఇరు సేనల మధ్య ఘర్షణ జరిగిందని భారత్ పేర్కొంది. (‘భారత్ చర్యలతో.. సంబంధాలు సంక్లిష్టం’)
ప్రభుత్వ నివేదికల ప్రకారం.. ఈశాన్యంలోని గల్వాన్ వ్యాలీ, పాంగోంగ్ త్సోలోని ఎల్ఏసీ భారత సరిహద్దు వైపు అధిక సంఖ్యలో చైనా దళాలు శిబిరాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనా దళాల మధ్య నెల రోజులుగా భీకర పోరాటాలు జరుగుతున్నాయి. సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందకు ఓవైపు ఇరు దేశాల దౌత్యవేత్తలు చర్చలు జరుపుతున్నా.. భారత జవాన్లపై డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజా అలజడి నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ఆర్మీ అప్రమత్తమయ్యింది. చైనా దాడులను తిప్పికొట్టే విధంగా బలగాలను తరలిస్తున్నట్టు సమాచారం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. (లదాఖ్‌లో చైనా దొంగ దెబ్బ)
Comments
Please login to add a commentAdd a comment