
ఎస్ఐని నీళ్లలో ముంచి.. చంపబోయారు!
మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో నలుగురు యువకులు కలిసి ఓ ఎస్ఐని నీళ్లలో ముంచి.. చితక్కొట్టి చంపేయబోయారు.
మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో నలుగురు యువకులు కలిసి ఓ ఎస్ఐని నీళ్లలో ముంచి.. చితక్కొట్టి చంపేయబోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో సెల్‌ఫోన్‌లో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా వ్యాపించింది. నిమజ్జనం ప్రక్రియ మధ్యలో ఆగడంతో.. దాన్ని తిరిగి ప్రారంభించడానికి నితిన్ ధాగ్లే (38) అనే ఎస్ఐ ప్రయత్నిస్తుండగా ఆయనను నలుగురు యువకులు చెరువులోకి తోసేశారు. వాళ్లలో ఒకడు ఆయనను నీళ్లలో ముంచి విపరీతంగా కొట్టాడు. ఆయన ఎలాగోలా బయటపడి, ప్రాణాలు దక్కించుకున్నారు. యువకులంతా పసుపుపచ్చరంగు టీషర్టులు, షార్ట్స్ ధరించి ఉన్నారు.
తీస్‌గావ్ చెరువులో నిమజ్జనం కార్యక్రమాన్ని కొంతమందితో కూడిన బృందం ఆపినట్లు మంగళవారం రాత్రి 9.30 గంట ప్రాంతంలో పోలీసులకు ఫోన్ వచ్చింది. జరి మరి గణేశ్ ఉత్సవ్ మండల్‌కు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న యువకులు అక్కడ బారికేడ్ పెట్టి, తమ విగ్రహాన్ని అక్కడే ఉంచేసి మొత్తం నిమజ్జనానికి అడ్డుగా ఉన్నారు. వాళ్లను కూడా క్యూలో రమ్మని ఎస్ఐ ధాగ్లే చెప్పగా, వాళ్లు వినిపించుకోలేదు. దాంతో ఆయన ఎలాగైనా నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రయత్నించారు. దాంతో ఆ నలుగురూ ఒక్కసారిగా ముందుకు దూకి ధాగ్లేను చెరువులోకి తోసేశారు. వాళ్లలో ఒకడు ధాగ్లే మీదకు దూకి.. ఆయనను ముంచేయడానికి ప్రయత్నించాడు. ఆయన ఎలాగోలా బయటకు వచ్చినా, మిగిలిన ముగ్గురూ బయట కూడా కొట్టారు.