త్వరలో వేతన చట్టం సవరణ: కేంద్ర మంత్రి
హైదరాబాద్:
సంస్థలు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల వేతనాలను చెక్కులు లేదా ఆన్‌లైన్‌లో చెల్లించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇందుకోసం త్వరలో వేతన చట్టానికి సవరణ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల వేతనాలను నగదు రూపంలో చెల్లిస్తున్నారని, అయితే ఇందులో ఉద్యోగి మోసానికి గురవుతున్నాడని వివరించారు.
లెక్కల్లో చూపే వేతనానికి, చెల్లించే అసలు మొత్తానికి తేడా ఉంటోందని, దీనిపై కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. మనీ ట్రాన్సాక‌్షన్లలో పారదర్శకత సాధించటంతోపాటు మోసానికి తావులేకుండా కొత్త విధానం తేనున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధానం అమలులోకి వస్తే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు బ్యాంకు అకౌంట్ల ద్వారానే జరుగుతాయని చెప్పారు. ఈ సవరణతోపాటు మెటెర్నిటీ బెనిఫిట్, ఉద్యోగుల పరిహార చట్టాలను కూడా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చేయనున్నట్లు వెల్లడించారు.