జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.
♦ కశ్మీర్‌పై అరుణ్ జైట్లీ
♦ నేడు ఢిల్లీకి మెహబూబా
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని బీజేపీ చెప్పగా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కశ్మీర్ అంశం చర్చకురాలేదని, అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఉద్దేశించిన ఎజెండాకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు చెప్పారు. ఈ సంక్షోభాన్ని తొలగించేందుకు మెహబూబా ముఫ్తీ త్వరలోనే పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
భేటీ తేదీ ఇంకా ఖరారు కాలేదని, అయితే పార్టీ సీనియర్ నేతలు జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేతతో జమ్ములోనే నిలిచిపోయారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ముఫ్తీల సమావేశంలోనూ ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి రాలేదు. మెహబూబా ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి ప్రస్తుత అనిశ్చితిపై పార్టీ వైఖరి వెల్లడించనున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. పీడీపీ కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్పారు. కొంతమంది పీడీపీ ఎమ్మెల్యేలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకే వారు మొగ్గుచూపుతున్నారన్నారు. మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మరణించిన మరుసటి రోజైన జనవరి 8 నుంచి రాష్ట్రం గవర్నర్ పాలనలో ఉంది.