![We Can Enter Into Lahore Easily, Says RSS leader Indresh Kumar - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/1/RSS-Leader-Indresh-kumar.jpg.webp?itok=ejlJsr8Z)
ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ (పాత చిత్రం)
నాగ్‌పూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత ఇంద్రేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశిస్తుందని, అందుకు కేంద్రం గతంలో చేసిన సర్జికల్ దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రస్తుత పరిస్థితి-స్థితిగతులపై మాట్లాడుతూ.. 300 మంది ఉగ్రవాదులను ఏరివేశామంటూ దాయాది పాక్‌ను హెచ్చరించారు. జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండగా కేవలం మూడు, నాలుగు పర్యాలు చేసిన కీలక దాడుల్లోనే ఈ ఘటన సాధించామన్నారు.
కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ.. ఆర్మీకి, ఎన్‌ఐఏ నిఘా విభాగాలకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఉగ్రవాదులను ఏరివేస్తూ పాక్‌ను దెబ్బతీసినట్లు చెప్పారు. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిందన్నారు. లాహోర్‌లో ఎప్పుడైనా మేం కాలుపెట్టగలమని తెలపడమే సర్జికల్ దాడుల సారాంశమని అభిప్రాయపడ్డారు. అఖండ భారతాన్ని పునర్‌నిర్మించాలని తాము కలలు కంటున్నామని.. నాగ్‌పూర్, లాహోర్‌లలో సొంత నివాసాలు కట్టుకోవాలనుందని మనసులో మాట బయటపెట్టారు. తుదిశ్వాస విడిచేవరకూ అఖండ భారత నిర్మాణం కోసం ఆరెస్సెస్ పని చేస్తుందన్నారు. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ల భావజాలంతో నవ భారతం నిర్మితమౌతుందని ఇంద్రేష్ కుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment