
తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వలేం: అద్వానీ
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో బీజేపీపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే. తెలంగాణ బిల్లుకు తాము మద్దతు ఇవ్వలేమని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీ.టీడీపీ నేతలు మంగళవారం బీజేపీ నేతలు అద్వానీ, అరుణ్జైట్లీని కలిశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారు ఈ సందర్బంగా కోరారు.
కాగా బిఎసి అసలు ఎజెండాలో తెలంగాణ విషయం లేదని సమావేశం మొదలయ్యాక టేబుల్ ఐటంగా సర్క్యులేట్ చేశారని తెలంగాణటిడిపి నేతలు అద్వానీకి వివరించారు. అయితే తెలంగాణ విషయంలో తాము స్పష్టంగా ఉన్నామనీ.. కాంగ్రెస్ డ్రామాలాడుతోందని అద్వానీ అన్నట్టు టిడిపి నేతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిల్లుకు సపోర్టు చేయలేమని అద్వానీ అన్నారని వారు పేర్కొన్నారు. తెలంగాణ బిల్లు తప్పుల తడకగా ఉందని...న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని ...ఇటువంటి బిల్లును తన జీవితంలో చూడలేదని అద్వానీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.