
మన్మోహన్‌కు గబ్బిలాల స్వాగతం!
పక్షులు, జంతుజాలంతో నిండిపోయిన మోతీలాల్ బంగ్లా
న్యూఢిల్లీ: ఆపద్ధర్మ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం 7 రేస్‌కోర్స్ రోడ్డులోని తన అధికారిక నివాసం నుంచి కుటుంబ సమేతంగా ఖాళీ చేసి 3, మోతీలాల్ నెహ్రూ బంగళాలోకి మారనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ బంగళాలో మన్మోహన్ కుటుంబానికి గబ్బిలాలు, పక్షులు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి! గతంలో ఈ బంగళాలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసమున్న సమయంలోనూ ఈ గబ్బిలాలు, జంతుజాలం ఇక్కడే ఉన్నాయని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని తొలగించేందుకు దీక్షిత్ ససేమిరా అనడంతో ఆయా పక్షులు, క్షీరదాలు అక్కడే ఉండిపోయాయని నివాసాన్ని శుభ్రం చేయిస్తున్న ఓ అధికారి వెల్లడించారు.
బంగళా చుట్టూ 40 చెట్లు ఉన్నాయని, వీటికి వేలాడుతూ 200కు పైగా గబ్బిలాలు ఉన్నాయన్నారు. 60 రకాల పక్షులు బంగళాను శాశ్వత నివాసంగా మార్చుకున్నాయన్నారు. వీటిలో ఆకుపచ్చని పావురాలు, మైనా, కోయిలలు, చిలుకలు, గుడ్లగూబలు, లకుముకి పిట్టలు తదితర అనేక రకాల పక్షులు నివసిస్తున్నాయన్నారు. టైప్-8 బంగళాగా పేరొందిన ఈ నివాసంలోకి సోమవారం సాయంత్రం మన్మోహన్‌సింగ్ చేరుకుంటారన్నారు.