కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పులో కీలక ముందడుగు పడింది. గత కొంత కాలంగా బెంగాల్ పేరు మార్పు కోసం సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పేరును ‘బంగ్లా’గా మార్చుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది. అన్ని భాషల్లోనూ ‘బంగ్లా’ అనే పేరే ఉంటుందని అందులో పేర్కొంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర హోం శాఖ ఆమోదం పొందిన వెంటనే ఈ పేరు అమల్లోకి రానుంది.
2016లో పశ్చిమ బెంగాల్ పేరును బెంగాలీలో ‘బంగ్లా’గా, ఇంగ్లిష్‌లో ‘బెంగాల్’గా, హిందీలో ‘బంగాల్’గా మార్చుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. అప్పుడు దీనిని విషక్ష కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించాయి. ఈ తీర్మానంపై కేంద్రం స్పందిస్తూ.. మూడు భాషల్లో వేర్వేరు పేర్లు కాకుండా, అన్ని భాషల్లో ఒకే పేరు ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. దీంతో 2017 సెప్టెంబర్ 17న పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’ గా మార్చుతూ మమతా క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.
కాగా బెంగాల్‌లో అక్రమంగా చెలామణిలో ఉన్న ఓ లిక్కర్ బ్రాండ్‌కు బంగ్లా అనే పేరు ఉంది. దీంతో చాలా మంది బెంగాల్ వాసులు ఈ పేరుపై అభ్యంతరం తెలుపుతున్నారు. ప్రస్తుతం బెంగాల్‌ని పశ్చిమ్ బంగా, పశ్చిమ్ బంగ్లా అని పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment