పశ్చిమ బెంగాల్ పేరు మారబోతున్నదోచ్!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరు మారబోతున్నది. ఆ రాష్ట్రాన్ని ఇక నుంచి ఆంగ్లంలో ‘బెంగాల్’గా, బెంగాలీ భాషలో అయితే ‘బంగో’ లేదా ‘బంగా’గా పిలువాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు ప్రతిపాదనకు బెంగాల్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.
పేరు మార్పు తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ తీర్మానం ఆమోదం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ నిర్వహించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉండటంతో ఈ తీర్మానం ఆమోదం పొందడం ఖాయమే.
ఒకప్పుడు వంగ దేశంగా పిలువబడిన పశ్చిమ బెంగాల్ పేరుమార్పు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తే.. ఇక ఆంగ్లంలో ఆ రాష్ట్రాన్ని బెంగాల్‌గా పిలువాల్సి ఉంటుంది. ఈ మేరకు పేరుమార్పు కోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానికులు మాట్లాడరీతిలోనే నగరం పేరు ఉండాలనే ఉద్దేశంతో కలకత్తా పేరును కోల్‌కతాగా మార్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్ పేరును కూడా రాష్ట్ర ప్రజలు పలికే రీతిలో బెంగాల్, బంగాగా మార్చాలని నిర్ణయించారు.