కోల్‌కతా : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్ ప్రాంతాలలో మినహా అన్ని జోన్లలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరచి ఉంచాలని మమతా బెనర్జీ సర్కార్ స్పష్టం చేసింది. అలాగే ఒక్కో వ్యక్తికి రెండు మద్యం బాటిళ్లను మాత్రమే అమ్మాలని నిబంధనలు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోను మద్యం అమ్మవద్దని ఆదేశించింది. కస్టమర్లు భౌతిక దూరం పాటించేలా చూసుకోవాల్సిన బాధ్యత షాపు యజమానిదేనని స్పష్టం చేసింది.
(చదవండి : మందు బాబులపై పేలుతున్న జోకులు)
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల సోమవారం ఉదయం మద్యం దుకాణాలు తెరచుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హరియాణా, ఆంధ్రపదేశ్ తదితర రాష్ట్రాలలో మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. కొన్ని చోట్ల ముఖానికి మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్న నిబంధనలను పాటించకపోవడంతో మధ్యాహ్నమే మద్యం దుకాణాలను మూసేశారు.
Comments
Please login to add a commentAdd a comment