హిందుస్థాన్‌ ఎలా వచ్చిందో తెలుసా? | What is Hindhustan | Sakshi
Sakshi News home page

హిందుస్థాన్‌ ఎలా వచ్చిందో తెలుసా?

Published Mon, Oct 30 2017 2:27 PM | Last Updated on Mon, Oct 30 2017 2:32 PM

What is Hindhustan

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ శనివారం ఇండోర్‌లో మాట్లాడుతూ జర్మనీ దేశం ఎవరిదని ప్రశ్నించారు. ప్రజల నుంచి సమాధానం కోసం ఎదురు చూడకుండానే జర్మన్లది జర్మనీ దేశమని, బ్రిటిషర్లది బ్రిటన్‌ దేశమని, అమెరికన్లది అమెరికా దేశమని, అలాగే హిందువులది హిందుస్థాన్‌ అని చెప్పారు. ఒకింత గర్వం ఉట్టిపడేలా మాట్లాడారు. ఆయనొక్కరే కాదు, సంఘ్‌ పరివార్‌ నుంచి వచ్చిన వారంతా అలాగే మాట్లాడుతారు. సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారత దేశాన్ని ఉద్దేశించి హిందుస్థాన్‌ అని సంబోధించారు. అందుకు ఆయనపై కేసును కూడా దాఖలయింది.

ఇదంతా హిందుస్థాన్‌ అనే పదం ఎలా వచ్చిందో తెలియకపోవడమే. అది కనీసం భారతీయుల భాషల నుంచి వచ్చిన పదం కూడా కాదనే విషయం తెలుసో, తెలియదో!. హిందుస్థాన్‌ అనే పదం సింధుస్థాన్‌ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని హిందుత్వ వ్యవస్థాపకుడు వినయ్‌ సావర్కర్‌ చెప్పారు. సంస్కృతంలో ఎస్‌ పదాన్ని భారతీయ భాషల్లో హెచ్‌గా ఉచ్ఛరిస్తారు గనుక ఆయన సూత్రీకరణను కొంత వరకు అంగీకరించవచ్చు. వాస్తవానికి సింధూ నది తీరం వెంట నివసించేవారిని సింధువులుగా పిలిచేవారని చరిత్ర చెబుతోంది. వ్యవహారికంలో సింధువుకాస్త, హిందువుగా మారిపోయింది. దీనికి పర్షియన్‌ స్థాన్‌ వచ్చి చేరడంతో హిందుస్థాన్‌ అయింది. మొట్టమొదట భారత్‌ను హిందుస్థాన్‌ అని పిలిచింది కూడా పర్షియన్లే. పర్షియన్‌లో స్థాన్‌ అంటే ల్యాండ్‌ అని అర్థం. పర్షియన్ల కారణంగానే హిందుస్థాన్‌తోపాటు, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, కజకిస్థాన్‌ దేశాలకు పేర్లు వచ్చాయి.

18వ శతాబ్దంలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి యాత్ర చేసిన ప్రముఖ ట్రావెలర్‌ దర్గా ఖులీ ఖాన్‌ తన యాత్రా విశేషాలను వివరిస్తూ పర్షియన్‌లో రాసిన పుస్తకానికి కూడా ‘డెక్కన్‌ టు హిందుస్థాన్‌’ అని పేరు పెట్టారు. సింధూ నది చైనాలోని పశ్చిమ టిబెట్‌ ప్రాంతంలో పుట్టి భారత్‌లోని కశ్మీర్‌ మీదుగా పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తోంది. ఈ నదీ తీరాన నివసించిన వారంతా హిందువులే అయితే పశ్చిమ టిబెటిన్లు, పాకిస్థానీయులు కూడా హిందువులే కావాలి. పర్షియన్లతోపాటు బ్రిటీష్‌ పాలకులు కూడా దేశంలోని ఉత్తరాది ప్రాంతాలను హిందుస్థాన్‌గా వ్యవహరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశం పేరును హిందుస్థాన్‌గా మార్చాలని హిందుత్వ శక్తులు గట్టిగానే వాదించాయి. అయితే దేశ వ్యవస్థాపక నాయకులు అందుకు అంగీకరించకపోవడంతో భారత దేశంగా మిగిలిపోయింది.

ఇప్పటికీ హిందూత్వ శక్తులు మైకు దొరికినప్పుడల్లా హిందుస్థాన్‌ డిమాండ్‌ను తీసుకొస్తున్నాయి. జర్మన్ల నుంచి జర్మనీ దేశం వచ్చిందంటూ తప్పుడు సూత్రీకరణ ను కూడా తెరపైకి తెస్తారు. జర్మన్లు తమ దేశాన్ని మొదటి నుంచి డాచ్‌లాండ్‌ అని పిలుచుకునేవాళ్లు. వారి దేశాన్ని జర్మనీగా వ్యవహరించిందీ బ్రిటీషర్లే. ఆ మాటకొస్తే నెదర్లాండ్‌ను హోలండ్‌గా వ్యవహరిస్తారు. భారత్‌ను హిందుస్థాన్‌గా పిలిచినంత మాత్రాన హిందువులకే ఈ దేశం మీద సర్వహక్కులు సిద్ధిస్థాయా? అమెరికన్లది అమెరికా దేశమని కూడా మన మోహన్‌ భగవత్‌ అన్నారు. అది ఒక వలసల దేశమని, సకల దేశాల ప్రజలు అక్కడ ఉంటున్నారన్న విషయం ఆయనకు తెలియదా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement