
వాట్పాప్ సందేశమే ఆదుకుంటోంది..
షిమ్లా: జమ్ము కశ్మీర్ పర్వతాల్లో చిక్కుకున్న ఓ పర్వతాహకుడ్ని వాట్సాప్ సందేశం ఆదుకుంది. ఆపద నుంచి కాపాడబోతోంది. కార్గిల్ సమీపంలో జానస్కార్ లోని ఉమాసి పాస్ పరిసర ప్రాంతంలో చిక్కుకుపోయిన టెక్కర్ రిజుల్ గిల్ రక్షించేందుకు ప్రభుత్వం, సైన్యం పాటుపడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతానికి చెందిన గిల్ అనే పర్వతారోహకుడు అనూహ్యంగా ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అరుణ్ శర్మకి సమాచారం అందించాడు. దీంతో అరుణ్ దీన్ని వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపాడు.
వాట్సాప్ గ్రూప్ ద్వారా టెక్కర్ రిజుల్ గిల్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ రాజేష్ కన్వార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలయ్యాడన్న సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యామని, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, సైన్యం సహాయంతో అతన్ని అక్కణ్నించి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రెక్కర్ ను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్ కోసం కార్గిల్ అధికారులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే అతణ్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్నారు.
అయితే తన మిత్రుడు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికే నాలుగురోజులైందని, ఇక రెండు రోజులకు సరపడా ఆహారం మాత్రమే అతడి దగ్గర ఉందని గిల్ స్నేహితుడు అరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.