రాజీనామా చేసి, ఇంట్లో కూర్చుంటా: సీఎం
సాక్షి, పనాజీ : ‘నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 10 ఏళ్ల కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని భావించాను. ఒకవేళ నేను రాజకీయాలకు తగిన వాడిని కాదని ఆలోచన వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేవాడినని’ కేంద్ర మాజీ మంత్రి, గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. ఐఐటీ బాంబే గ్రాడ‍్యుయేట్ అయిన తాను తనకు ఇష్టం లేకున్నా రాజకీయ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
’గతంలో కేంద్రం సూచన మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి అక్కడ మంత్రి పదవి చేపట్టాను. అయితే గోవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మీ కోసం తిరిగొచ్చేశాను. ఈసారి ఏం జరిగినా సరే.. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచి వెళ్లిపోను. సీఎంగా పూర్తికాలం పదవిలో కొనసాగుతాను. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఒకవేళ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడినైతే ఢిల్లీ రాజకీయాలకు అనుగుణంగా మారేవాడినని’ ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల గోవాలోని పనాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన సీఎం పారికర్ ఘన విజయం సాధించారు.