
పుట్టగానే ఆ కేంద్ర మంత్రిని చంపేయమన్నారు
న్యూఢిల్లీ: ఆమె జన్మించినపుడు ఆడపిల్ల భారమని కొందరు పెదవి విరిచారు. ఆ చిన్నారిని చంపేయమని తల్లికి నూరిపోశారు. అయితే ఆ మాతృమూర్తి ఆ పనిచేయలేదు. ఆడపిల్ల అనే వివక్ష చూపకుండా ధైర్యంగా పెంచింది. కాలక్రమంలో ఆ అమ్మాయి ఉన్నత స్థాయికి చేరుకుంది. నేడు ఏకంగా నేడు కేంద్ర మంత్రి అయ్యారు. ఈ చిన్నారి మరెవరో కాదు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ.
స్మృతియే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. తాను జన్మించినపుడు తల్లికి ఎదురైన అనుభవాన్ని తొలిసారి బయటపెడుతున్నానని చెప్పారు. తన తల్లి ఆనాడు ధైర్యమైన నిర్ణయం తీసుకోవడం వల్లే తానీ రోజు కేంద్ర మంత్రి కాగలిగానని అన్నారు. ఆడపిల్లలను భారంగా భావించరాదని మంత్రి చెప్పారు. అమ్మాయిలకు చదువు చెప్పిస్తే కుటుంబానికి ఉపయోగపడుతుందని, తద్వారా దేశపురోభవృద్దికి తోడ్పడుతుందని స్మృతి అన్నారు.