ప్రధాని ప్రసంగంపై ప్రతిపక్షాల పెదవి విరుపు
న్యూఢిల్లీ: జాతి నుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం నిరాశపరిచిందని కాంగ్రెస్ పేర్కొంది. గత 50 రోజుల్లో ఎన్ని లక్షల కోట్ల నల్లధనం లెక్కల్లోకి వచ్చిందో ప్రసంగంలో ప్రధాని ఎందుకు పేర్కొనలేదంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని... ప్రధాని మాత్రం కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్నారు. నగదు విత్‌డ్రాపై ఆంక్షలు ఎత్తివేస్తారేమోనని ప్రజలంతా ఎదురుచూశారని ఆయన అన్నారు.
ఆర్థిక మంత్రిలా మాట్లాడారు: మమత
బడ్జెట్‌కు ముందస్తు ప్రసంగం చేస్తున్నట్లు మోదీ మాట్లాడారని, కొద్దిసేపు ఆర్థిక మంత్రిలా మారారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. నోట్ల రద్దుకు సంబంధించిన లెక్కలు ఎక్కడ? ఎంత మేర నల్లధనం స్వాధీనం చేసుకున్నారు? అని మమత ప్రశ్నించారు. ప్రధాని బినామీ ఆస్తులపై భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి ఎలాంటి ప్రకటనల చేయలేదని జేడీయూ విమర్శించింది..
విత్‌డ్రా పరిమితి తొలగించాలి : రాహుల్
ప్రధాని ప్రసంగానికి ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కొత్త డిమాండ్లు మోదీ ముందుంచారు. నగదు విత్‌డ్రాల్స్‌పై పరిమితిని ఎత్తివేయాలని, దారిద్య రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.25 వేల చొప్పున చెల్లించాలని శనివారం ట్వీటర్ ద్వారా డిమాండ్ చేశారు.
రాహుల్ ఇతర డిమాండ్లివే...
► ఆన్‌లైన్ సేవలపై చార్జీలు ఎత్తివేయాలి. చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఆదాయ పన్నులో 50 శాతం రిబేట్.
► ఆంక్షలు విధించిన కాలానికి అన్ని బ్యాంకు ఖాతాల వారికీ 18 శాతం వడ్డీ చెల్లించాలి.
► మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద పని దినాలు రెట్టింపు చేయాలి.
నల్లధనం లెక్క ఎక్కడ?
Published Sun, Jan 1 2017 2:27 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement