అమితాబ్ తప్ప ఎవరూ దొరకలేదా?
పనామా పేపర్ల వ్యవహారంలో అపప్రథకు గురైన అమితాబ్ బచ్చన్‌ను ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణకు వ్యాఖ్యాతగా పెట్టడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మోదీ సర్కారు రెండేళ్ల పాలన ముగిసిన సందర్భంగా ఇండియాగేట్ వద్ద శనివారం నిర్వహించే మెగా కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్‌ను వ్యాఖ్యాతగా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. నల్లధనాన్ని వెనక్కి తెస్తానని, ఆ వ్యవహారంలో ఎవరున్నా శిక్షిస్తానని ప్రధాని మోదీ గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదేమని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. మనీలాండరింగ్‌లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలొచ్చిన వ్యక్తికి అంత పెద్దపీట వేయడం దర్యాప్తు సంస్థలకు ఎలాంటి సంకేతాన్ని పంపుతుందని నిలదీశారు. అమితాబ్‌ను మంచి నటుడిగా, పెద్దమనిషిగా దేశంలోని అందరూ ప్రేమిస్తారని, అయితే.. ఆయన పేరు పనామా పేపర్లలో ఉందన్న విషయం మాత్రం మర్చిపోకూడదని అన్నారు.
ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఇప్పటివరకు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమాల్లో ఇదే అతి పెద్దదని చెబుతున్నారు. ఈ కార్యక్రమం చివర్లో మోదీ పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి 'ఓ కొత్త ఉదయం' అని పేరుపెట్టారు. ఇందులో అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, జూహీ చావ్లా లాంటి బాలీవుడ్ ప్రముఖులు పలువురు పాల్గొంటారు.
అయితే.. కాంగ్రెస్ ఆరోపణలను అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఖండించారు. తన తండ్రి ఏమీ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, ఇండియాగేట్ వద్ద జరిగే కార్యక్రమంలో బాలికల విద్య ఆవశ్యకత మీద మాత్రమే ఆయన మాట్లాడతారని, దీన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు.