అమితాబ్ బచ్చన్ (ఫైల్ ఫోటో)
స్టార్ హీరోలందరూ ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కమల్ తన రాజకీయ ప్రవేశాన్ని ధృవీకరించగా.. రజనీ కాంత్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కూడా మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్‌బి ట్విట్టర్ యాక్టివిటీని బట్టి ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. తాజాగా బిగ్‌బి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, మరికొంత మంది పార్టీ ప్రముఖ నేతలను ఫాలో అవడం మొదలు పెట్టారు. బోఫోర్స్ స్కాం ముందు వరకు బిగ్‌బి గాంధీలతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీతో ఆయనకు సానిహిత్యం చాలా ఎక్కువ. రాజీవ్ హయాంలో బిగ్‌బి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. కానీ బోఫోర్స్ స్కాంలో బిగ్‌బికి కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు రావడంతో, గాంధీలతో ఆయనకున్న సంబంధాలు దెబ్బతిన్నాయి.
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను, పార్టీ నేతలు చిదంబరం, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, సచిన్ పైలట్, సీపీ జోషిని ఫాలో అవడం ప్రారంభించారు. ట్విట్టర్‌లో అమితాబ్ ఫాలోవర్స్ 33.1 మిలియన్‌కు పైగా ఉన్నారు. కానీ ఆయన ఫాలో అయ్యేది కేవలం 1,689 మంది మాత్రమే. వారిలో కాంగ్రెస్ నేతలు ఉండటం గమనార్హం. తన ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవుతున్నందుకు ఫిబ్రవరి 20న కాంగ్రెస్ నేత మనీష్ తివారీ, బిగ్‌బికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి సినిమా విడుదలను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ పెరిగామని, ఇండియన్ సినిమా ఐకాన్‌ను ఫాలోవడం తమ హక్కుగా భావిస్తామని ట్వీట్ చేశారు. 70,80 ల్లో చండీఘర్‌లో బాల్కనీ టిక్కెట్ తీసుకుని మరీ సినిమా చూసేవాళ్లమని, అది ఇప్పటికీ నమ్మలేకపోతామని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు బిగ్‌బి ఫాలో అయ్యే నేతల్లో ఆర్‌జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన కూతురు మిశా భారతి, జేడీయూ నితీష్ కుమార్, ఎస్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా, సీపీఐ-ఎం నేత సీతారాం ఏచూరీ, ఆప్ లీడర్లు మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, అశీష్ కేతన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment