
ప్రభుత్వమే చిచ్చు పెట్టేలా ఉంది!
దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా మందలించింది. రెండు మతాల మధ్య విభేధాలు వచ్చేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని కలకత్తా హైకోర్టు బుధవారం ప్రశ్నించింది.
- మమతను మందలించిన కోల్‌కతా హైకోర్టు
- మతాల మధ్య స్నేహాన్ని పెంచాలని సూచన
సాక్షి, కోల్‌కతా : దుర్గాదేవి విగ్రహాల నిమజ్జన విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రెండు మతాల మధ్య విభేధాలు వచ్చేలా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోందని కలకత్తా హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. రెండు మతాలవారూ తమతమ పండుగలను సంతోషంగా అందరూ కలిసి నిర్వహించునే వాతావరణాన్ని ఎందుకు ప్రభుత్వం కల్పించలేకపోతోందని కోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు అక్షింతలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో స్పందిస్తూ.. ప్రభుత్వం ఎక్కడా దుర్గా పూజలను నిషేధించలేదని చెప్పారు. ప్రభుత్వ ప్రకటనను కొన్ని వర్గాలు తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. అక్టోబర్ 1న ఏకాదశి, మొహర్రం పండుగలు ఒకే రోజున రావడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే నిమజ్జ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిషేధించిందని చెప్పారు. మొహర్రం రోజున ముస్లిం సోదరులు కార్యక్రమాలు చేసుకుంటారని.. అందువల్ల ఒకటో తారీఖున నిషేధించినట్లు ప్రకటించారు. తరువాత 2 నుంచి నాలుగో తేదీవరకూ యథావిధిగా నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని మమతా బెనర్జీ ప్రకటించారు. దుర్గా నవరాత్రులకు సంబంధించి వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె చెప్పారు.