దమ్ముంటే సోనియాగాంధీని అరెస్టు చేయ్!
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్‌లో కుంభకోణంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌లను టార్గెట్‌గా చేసుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన దాడిని ముమ్మరం చేశారు. బీజేపీకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అరెస్టు చేయాలని సవాల్ చేశారు. సోనియాతోపాటు హెలికాప్టర్ల స్కాం కేసులో ఇటలీ కోర్టు తీర్పులో పేర్కొన్న వ్యక్తులందరినీ అరెస్టుచేసి, విచారించాలని ఆయన ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు.
ఈ స్కాంలో నిందితులను అరెస్టు చేసేంతా నీతి బీజేపీ వద్ద లేదని, బీజేపీ-కాంగ్రెస్ మధ్య లోపాయికారి అనుబంధముందని ఆయన విమర్శించారు. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. గతంలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను విడిచిపెట్టిన బీజేపీ.. ఇప్పుడు ఈ స్కాంలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ అధినాయకత్వాన్ని మొత్తాన్ని రక్షిస్తున్నదని విమర్శించారు.
తనపై గతంలో సీబీఐ దాడులు జరిపించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై ఎందుకు ఆ దాడులు చేయించడం లేదని ప్రశ్నించారు. వీవీఐపీ కొనుగోళ్ల విషయమై అగస్టా వెస్ట్‌లాండ్ కంపెనీతో యూపీఏ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ ఇటలీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.