సాక్షి, రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక వెనుకబడిన వర్గాల జాబితా కింద ఐదు కులాలను చేర్చి వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇప్పటికే విద్యారంగంలో దళితులకు 16 శాతం, ఆదివాసీలకు 12 శాతం, ఇతర వెనుకబడిన వర్గాల వారికి 21 శాతం చొప్పున 59 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 54 శాతం చేరుకుంటాయి. సుప్రీం కోర్టు 1992లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు.
రాజస్థాన్ ప్రభుత్వం ఇంతకుముందు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల కింద కొన్ని కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు యాభై శాతం శీలింగ్ దాటిందన్న ఆరోపణతోపాటు మరికొన్ని ఇతర కారణాలతో 2016లో రాజస్థాన్ హైకోర్టు కొట్టివేసింది. 2017లో ఒడిశా అదనంగా తీసుకొచ్చిన రిజర్వేషన్లను యాభై శాతం పరిమితి దాటిందన్న కారణంగానే ఒడిశా హైకోర్టు కొట్టివేసింది. అసలు ఈ 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఎందుకు ? దీన్ని సుప్రీం కోర్టు 1992లో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది? 50 శాతానికి మించకూడదన్న నిర్ణయానికి రావడానికి హేతుబద్ధమైన కారణాలేమిటీ? రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న చట్టం కేంద్రంలోగానీ, ఇటు ఏ రాష్ట్రంలోగానీ లేదు. అలాంటి సుప్రీం కోర్టు అత్యుత్సాహంతో ఈ పరిమితిని ఎందుకు తీసుకొచ్చింది?
భారత రాజ్యాంగంలోని 15వ అధికరణం (4) నిబంధన, 16వ అధికరణం (4)వ నిబంధన కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి మించరాదని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టు 1992లో తీర్పు చెప్పింది. ఆ తీర్పును అనుసరించే హైకోర్టులు రాష్ట్రాలు పరిమితిని ఉల్లంఘించినప్పుడల్లా రిజర్వేషన్ల నిర్ణయాన్ని కొట్టివేస్తున్నాయి. రిజర్వేషన్లు 40 శాతంగానీ, 80 శాతంగానీ ఎందుకు ఉండకూడదు? దేశంలో ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందారో, ఎవరు సామాజికంగా అభివద్ధి చెందలేదో, వారి శాతం ఎంత ? ఎవరెవరికి రిజర్వేషన్లు ఎంత శాతం అవసరం? అన్న లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్ల పరిమితి ఉండాలిగానీ, గుడ్డిగా సగానికి మించకూడదు అనడంలో అర్థం లేదు.
ఈ లెక్కలకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వాలు ఎలాంటి కసరత్తు చేయలేదు. మండల కమిషన్ 1980లో ఈ విషయంలో కొంత కసరత్తు చేసింది. ఆ కమిషన్ అంచనాల ప్రకారం దేశంలో 17 శాతం దళితులు, 8 శాతం ఆదివాసులుపోనూ 52 శాతం బీసీలు ఉన్నారు. వీరందరికి రిజర్వేషన్లు కల్పించాలని 77 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. 1931లో దేశంలో జరిగిన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నాటి మండల కమిషన్ 52 శాతం బీసీలు ఉన్నారని అంచనావేసింది.
దేశంలో కులాల ప్రాతిపదికన జరిగిన జనాభా లెక్కల కార్యక్రమం 1931లో జరిగినదే. 2011లో కులాలు, సామాజిక అంశాల ప్రాతిపదికన జనాభా లెక్కల కార్యక్రమం జరిగింది. నాటి కులాల లెక్కలను నేటికి కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేయలేదు. దేశంలో వెనకబడిన వర్గాల వారే ఎక్కువ శాతమని, అగ్ర కులాల వారు అతి తక్కువ శాతం ఉన్నారనే వాస్తవం వెలుగులోకి వస్తుందని, అప్పుడు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీలు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తాయన్న భయంతోనే కేంద్రంలోని వరుస ప్రభుత్వాలు ఈ వివరాలను వెల్లడించడం లేదు. పటేళ్లు, జాట్లు, మరాఠీలైన అగ్రవర్గాల వారు కూడా రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కులాల వాస్తవ వివరాలను వెల్లడించడమే ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment