ఇంతకీ నీళ్లెందుకు వదిలినట్టు?
ఇంతకీ నీళ్లెందుకు వదిలినట్టు?
Published Wed, Jun 11 2014 1:33 PM | Last Updated on Sat, Apr 6 2019 8:49 PM
* కారణం చెప్పని హిమాచల్ విద్యుత్ బోర్డు
* గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు
* లార్జి విషయంలో తొలినుంచీ పెద్ద అనుమానాలు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ సదిపై ఉన్న లార్జి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుంచి హఠాత్తుగా నీళ్లు ఎందుకు వదిలినట్టు? ఉన్నట్టుండి వదిలిన నీళ్లు హిమాచల్ లో పర్యటనకు వెళ్లిన మన విద్యార్థులు 24 మందిని పొట్టనబెట్టుకుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి, హిమాచల్ ముఖ్యమంత్రి, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మంత్రులు ప్రమాదం జరిగిన థాలోట్ గ్రామానికి వచ్చి వెళ్లినా, హిమాచల్ విద్యుత్ బోర్డు మాత్రం ఇప్పటి వరకూ నీటి విడుదలపై ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదు. కాబట్టి అసలు నీళ్లెందుకు వదిలారన్నది ఇప్పటికీ తెలియదు.
ఆదివారం సాయంత్రం 6 - 7 గంటల మధ్య ప్రాజెక్టు సిబ్బంది నీళ్లను వదిలారు. 6.15 కి 50 క్యుసెక్కులు, 6.30 కి 150 క్యుసెక్కులు, 6.45 కి 200 క్యుసెక్యులు విడుదల చేశారు. కానీ ఆ సమయంలో నీరెందుకు వదిలారన్న దానిపై ఎలాంటి వివరణా లేదు.
నిజానికి విద్యుత్ ప్రాజెక్టులు సాయంత్ర సమయంలో పూర్తి జోరుతో పనిచేస్తాయి. ఎందుకంటే చీకటి పడుతూండగానే విద్యుత్ వాడకం పెరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో నీరు వదిలితే విద్యుదుత్పాదన తగ్గుతుంది. అప్పటికే బొకారో, లక్నో, గోరఖ్ పూర్ వంటి ప్రాంతాల్లో విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. కాబట్టి ఆ సమయంలో నీరు వదలకూడదు.
అయితే ఏదైనా విద్యుత్ లైన్ ఉన్నట్టుండి ట్రిప్ అయితే, ఫుల్ లోడ్ లో పనిచేస్తున్న మెషీన్ల వల్ల నీరు బయటకు వెళ్తే అవకాశాలున్నాయి. చాలా ప్రాజెక్టుల నీటి మట్టం, నీటి విడుదల సమయం వంటి అంశాల్లో దక్షిణాదిలో ఉన్నంత పారదర్శకత ఉత్తరాదిలో లేకపోవడం వల్ల నీటి విడుదల ఎప్పుడు జరుగుతుంది, ఎంత నీరు విడుదల చేస్తారు, ఎందుకు విడుదల చేస్తారు వంటి అంశాల గురించి ప్రజలకు ఏమీ తెలియదు. పైగా నీటి విడుదలలో స్థానికుల భాగస్వామ్యం ఏ మాత్రం ఉండదు.
ఇలాంటి నీటి విడుదలలు ప్రాణాలు హరించడం ఇదే తొలిసారి కాదు.
* ఏప్రిల్ 7, 2005 నాడు మధ్యప్రదేశ్ లోని నర్మదా సాగర్ లో ఇలాగే నీరు వదిలేశారు. దిగువన భూతాది అమావాస్య పండుగ సందర్భంగా వేలాది మంది స్నానాలు చేస్తున్నారు. ఉన్నట్టుంది నీరు వచ్చి వారందరినీ ముంచేసింది. ఈ సంఘటనలో 150 మంది చనిపోయారు.
* జూన్ 30, 2007 నాడు మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ డ్యామ్ నుంచి నీరు చెప్పా పెట్టకుండా వదిలేయడంతో రెండు వేల మోటారు పంపు సెట్టు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం విస్తృతంగా జరిగింది.
* ఉత్తరాఖండ్, కర్నాటక, సిక్కిం, తమిళనాడుల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి.
* 2011 లో హీరాకుడ్ డ్యామ్ నుంచి నీరు ఉన్నట్టుండి వదిలేయడంతో దిగువ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చాయి.
లార్జి ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచీ ప్రశ్నలున్నాయి. ప్రాజెక్టు దిగువన రెండు స్కూళ్లు అనునిత్యం ప్రమాదం ఒడిలో ఉన్నట్టు ఉంటాయి. దీనిపై స్థానికులు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసినా స్కూళ్లను తరలించలేదు. కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ స్కూళ్ల విషయాన్ని హిమాచల్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు కూడా. కనీసం 24 మంది పిన్నవయసు ప్రాణాలు పోయిన తరువాతైనా అధికారులు, ప్రభుత్వాలు కళ్లు తెరుస్తాయా?
Advertisement
Advertisement