
'అయోధ్యలో రామ మందిరాన్ని మేమే నిర్మిస్తాం'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మరోసారి తెరపైకి వచ్చింది. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి తీరుతామని ద్వారక పీఠాధిపతి, అధ్యాత్మిక మతగురువు సద్గురు స్వరూపానంద సరస్వతి శంకరాచార్య తెగేసి చెప్పారు. సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పునిస్తే రాజకీయ మద్దతు లేకున్నా రాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు ఇకనైనా రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ సంసద్ ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో మెజారిటీ లేకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చట్టం తీసుకు రావడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
మొఘల్ రాజు బాబర్ పేరుతో రాజకీయం చేయాలని కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని శంకరాచార్య స్వరూపానంద మండిపడ్డారు. అయోధ్య హిందువుల పవిత్ర స్థలం అనే వాస్తవాన్ని ఆయన గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపైనా, ఎన్డీయే సర్కారుపైనా శంకరాచార్య విరుచుకుపడ్డారు.
'మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. దయచేసి రామ జన్మభూమి గురించి మాట్లాడకండి. మేం అక్కడ రామ మందిరాన్ని నిర్మిస్తాం. దేవుడి దయ వల్ల రాజకీయ నాయకులు డబ్బులు మాకు అవసరం లేదు. దయచేసి ఈ చర్చను ఆపండి.. ప్రజలు, సాధువులు సహాయ సహకారాలతో మేము రామ మందిరాన్ని నిర్మిస్తాం' అన్నారు. నాయకుల్లో ఆధ్మాత్మిక పరిజ్ఞానం కొరవడిందని ఆగ్రహం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ జపాన్ రాజుకు భగవద్గీతను బహుమతి ఇవ్వడానికి బదులుగా భారతదేశంలో పిల్లలకు గీతను ప్రబోధించే ఏర్పాటు చేసి ఉంటే తాను ఇంకా సంతోషించేవాడినని వ్యాఖ్యానించారు.