ఫైన్ కట్టే ప్రసక్తేలేదు... నిరవధిక దీక్ష చేస్తాం
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) వివాదం రోజురోజుకూ ముదిరిపోతుంది. వర్సిటీ ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ విద్యార్థినేత కన్హయ్యకుమార్కు రూ.10 వేల జరిమానా విధించిన విషయంతెలిసిందే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడన్న నేరంతో ఏబీవీపీ నాయకుడు సౌరభ్ శర్మకు కూడా రూ.20 వేల జరిమానా విధించింది. అయితే తాము జరిమానా కట్టే ప్రసక్తేలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఉన్నతస్థాయి కమిటీ ఉత్తర్వుల ప్రకారం హాస్టల్ ఖాళీచేసి వెళ్లనున్నట్లు తెలిపారు.
ఉత్తర్వులు రద్దుచేయాలంటూ నిరసనగా బుధవారం నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్ మీడియాకు వివరించారు. తమపై జరుగుతున్న విధానాలు, చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. ఆఫ్జల్‌గురు ఉరితీతకు వ్యతిరేకంగా గత ఫిబ్రవరి 9న కార్యక్రమం నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ కు జరిమానా విధించడంతో పాటు, ఉమర్, అనిర్బన్ భట్టాచార్యలు వర్సిటీలో మత హింసకు, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన కారణంగా ఉమర్‌ను ఒక సెమిస్టర్, ముజీబ్ గట్టూను రెండు సెమిస్టర్లు, భట్టాచార్యను జూలై 15 వరకు సోమవారం నాడు బహిష్కరించింది.