
3.5 లక్షల మందితో జాతీయ గీతాలాపన
గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన ‘కొదియార్’ భక్తులు
రాజ్‌కోట్: జాతీయ గీతాన్ని ఒకేసారి 3.5 లక్షల మంది ఆలపించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా కగ్‌వాడ్ ప్రాంతంలో శనివారం జరిగింది. గుజరాత్‌లోని ల్యూవా పటేల్ సామాజిక వర్గ ప్రజల ఆరాధ్య దేవతైన ‘కొదియార్’కు నూతనంగా ఆలయం నిర్మించారు. ఈ సందర్భంగా కొదియార్ దేవత విగ్రహావిష్కరణ జరుగుతున్న సమయంలో 3.5 లక్షల మందితో జనగణమన ఆలపించి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు హన్స్‌రాజ్ గజేరా తెలిపారు.
ఈ మేరకు గిన్నిస్ రికార్డ్ అధికారులు తమకు సర్టిఫికెట్ అందించినట్లు వెల్ల డించారు. 40 కి.మీ.ల మేర శోభాయాత్ర నిర్వహించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నట్లు వివరించారు. ఆలయం పక్కనున్న ఖాళీ స్థలంలో వ్యవసాయ వర్సిటీని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రూ.60 కోట్లతో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించుకున్నారని హన్స్‌రాజ్ తెలిపారు.