
లేడీ సుల్తాన్ ఇలాఖాలో మహిళల దుస్థితి
సాక్షిమాలిక్ స్వరాష్ట్రం హర్యానాలో, స్వంత గ్రామంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
ఛండీగర్: హర్యానా లేడీ సుల్తాన్, ఒలింపిక్ రెజ్లింగ్ లో భారతదేశానికి కాంస్య పతకాన్ని అందించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన సాక్షిమాలిక్ స్వరాష్ట్రం హర్యానాలో, స్వంత గ్రామంలో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా హర్యానాకు చెడ్డ పేరుంది. ఆ రాష్ట్రంలో అత్యధికంగా భ్రూణ హత్యలు జరుగుతున్నాయని ఇటీవలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకి 879 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సాక్షిమాలిక్ సొంత గ్రామమైన రోహ్తక్ జిల్లా మహమ్ తాలూకాలోని మొక్రా ఖాస్ లో స్త్రీల సంఖ్య కేవలం 822 మంది మాత్రమే. ఇది హర్యానా రాష్ట్ర సగటు కంటే చాలా తక్యువ. కానీ ప్రభుత్వం క్రీడాకారలకు ఇస్తున్న ప్రోత్సాహం వలన భారతదేశం నుంచి రియోలో అత్యధిక మహిళా క్రీడాకారులు హర్యానా నుంచే పాల్గొనడం గమనార్హం. మోక్రాఖాస్ సర్పంచ్ సురేందర్ మాలిక్ సాక్షి మాలిక్ ను స్పూర్తిగా తీసుకొని తమ గ్రామంలో స్త్రీల జనాభా పెరుగుదలలో మార్పు వస్తుందే్మోనని ఆశిస్తున్నానని తెలిపారు. సాక్షి ని స్ఫూర్తిగా తీసుకొనైనా హర్యానాలో భ్రూణ హత్యలు తగ్గుతాయోమో ఆశించాలి.