చనిపోయిన బంధువుల అంగీకారం లేనిదే మృతదేహాలకు పోస్ట్మార్టం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ బాధితురాలి తండ్రి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చెన్నై:తమిళనాడులోని విల్లుపురంలో ముగ్గురు మెడికోలు మోనీషా, శరణ్య, ప్రియాంక ఆత్మహత్యలపై వివాదం రగులుతోంది. ఆగమేఘాలమీద పోస్ట్‌మార్టం నిర్వహించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. చనిపోయిన బంధువుల అంగీకారం లేనిదే మృతదేహాలకు పోస్ట్మార్టం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తూ బాధితురాలి తండ్రి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండానే పోస్ట్మార్టం ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు తమ బిడ్డలను చంపి బావిలో పడేశారని, న్యాయ విచారణ జరిపించి నిజాలను నిగ్గుదేల్చాలని మోనీషా తండ్రి తమిళరసన్ డిమాండ్ చేశారు. తమ బిడ్డలను హత్యచేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
కళాశాలలో వసతులు సరిగా లేవని చనిపోయిన విద్యార్థినులు యాజమాన్యంతో పోరాడినట్టు లేఖలో రాశారు. విచక్షణారహితంగా వసూలు కాలేజీ అధిక ఫీజులు వసూలు చేస్తోందని, ఎలాంటి బిల్లులు లేకుండా సుమారు ఆరు లక్షల దాకా వసూలు చేశారని ఆరోపించారు. ఇంత చేసినా తాము నేర్చుకుంది శూన్యమని వాపోయారు. అధిక ఫీజులు కట్టాలంటూ వేధించారని రాశారు. దీంతో ఉద్రికత్త రాజుకుంది. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి.
అయితే ఈ కేసులో ఇప్పటికే నలుగురిని విచారించి కేసులు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మి ప్రకటించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని, విద్యార్థుల ఇతర డిమాండ్లను పరీశీలిస్తున్నామని తెలిపారు. శరణ్య మృతదేహానికి మాత్రమే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామని, బాధితుల ఆందోళనతో మిగిలినని ఆపివేశామన్నారు.
అటు హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరపించాలని డిఎంకె డిమాండ్ చేసింది. ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద వెనుక వున్న వాస్తవాలను వెల్లడి చేయాలని డిఎంకె చీఫ్ కరుణానిధి డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు, కాలేజీ యాజమాన్యం, ప్రభుతం తగిన పరిహారం చెల్లించాలన్నారు.
కాగా ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీలో ముగ్గురు వైద్య విద్యార్థినుల అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చనిపోయేముందు వారు రాసిన లేఖ ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థినులు చనిపోయినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అటు ఇది ముమ్మాటికే హత్యలే అని వాదిస్తున్న వారి సంఖ్యకూడా క్రమేపీ పెరుగుతోంది.