రాంచీ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ప్రభుత్వాస్పత్రిలో నవ శిశువుకు జన్మనిచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ సంఘటన జార్ఖండ్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో కిరణ్ కుమార్ పాసి అనే మహిళ జిల్లా కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గర్భవతి అయిన ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పురిటి నొప్పులు రావడంతో ముందుగా నిర్ణయించుకున్నట్లే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా సర్కారు దవాఖానకు వెళ్లి అక్కడ తన బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కిరణ్ కుమార్, తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అయినా ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలకు నమ్మకం పెరిగి వారిలో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.
కాగా ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఐఏఎస్ అధికారి డెలవరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం గర్వంగా ఉందన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తీసుకు రావడానికి దోహదపడుతుందని డాక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మరో మహిళ ఐఏఎస్ అధికారి నాన్సీ సహేతో సహా అనేక మంది అధికారులు ఆసుపత్రికి చేరుకుని కిరణ్ కుమార్‌ను అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment