చెప్పుల మాయ.. ఏసీల షీలా!!
అంది వచ్చిన అధికారాన్ని అయినకాడికి ఉపయోగించుకోవటంలో ప్రజా ప్రతినిధులు ముందుంటారు. అయితే అందుకు మహిళా ప్రజాప్రతినిధులు మినహాయింపు కాదేమో. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్ము అడ్డంగా అనుభవించటంలో వాళ్లకు మించినవారు లేరు. ఓవైపు ఢిల్లీవాసులు కరెంట్ కోతలతో కష్టాలు పడితే అప్పట్లో ఆ పీఠాన్ని ఏలిన షీలా దీక్షిత్ మాత్రం తన అధికార నివాసంలో ఏకంగా 31 ఏసీలు ఏర్పాటు చేసుకుని ఎంచక్కా కూల్గా విశ్రాంతి పొందారట. సమాచార హక్కు చట్టం హక్కు కింద అడిగిన ఒక వివరణలో షీలమ్మ గారి రాజభోగం బయటపడింది. కేవలం ఏసీలే కాకుండా, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫయర్లు, 12 గీజర్లను వాడేసుకున్నారు.
ఓ మహిళా ముఖ్యమంత్రి కొత్త చెప్పులు తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపిస్తే, మరొక ఆమె బంగారు ఆభరణాల్ని తరలించేందుకు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా అధికారం చేపట్టిన ఒకామె ... అవకాశం వచ్చినప్పుడల్లా విమానాలు ఎక్కి విదేశాల్లో చక్కర్లు కొట్టారు.
ఆడంబరాలను అతిగా ప్రేమించి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి కేవలం తనకు ఇష్టమైన బ్రాండు చెప్పులను తెప్పించుకోవడానికి ముంబైకి ఖాళీ విమానాన్ని పంపారు. ఈ విషయాన్ని వికీలీక్స్ బయటపెట్టడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
ఇక తమిళ పురుచ్చితలైవి జయలలిత ఏది చేసినా సంచలనమే. ఆభరణాలంటే తెగ మక్కువ చూపే ఆమె అక్రమాస్తుల కేసులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ ఆభరణాలను తరలించేందుకు అధికారులు మూడు వ్యాన్లు ఉపయోగించాల్సి వచ్చిందంటే ఊహించుకోవచ్చు. ఇక జయలలిత దగ్గర 750కి పైగా చెప్పులు కూడా ఉన్నాయని లెక్క తేల్చారు.
ఇదిలాఉంటే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా పనిచేసిన ప్రతిభా దేవీ సింగ్ పాటిల్ విదేశీ పర్యటనల వ్యయం వింటే కళ్లు గిర్రున తిరిగిపోవాల్సిందే. రాష్ట్రపతిగా పనిచేసిన ఐదేళ్లలో ఆమె విదేశీ పర్యటనల ఖర్చు 205 కోట్లు పైనే అయింది. మొత్తం 12 సార్లు 22 దేశాల్లో ఆమె పర్యటనల కోసం ఎయిరిండియాకు అయిన ఖర్చు 169 కోట్ల రూపాయిలు. ఇవన్నీ బయటకు వచ్చిన కొన్ని మాత్రమే. రాజు తలచుకుంటే...దెబ్బలకు కొదవా అన్నట్లు... కాదు కాదు... రాణులు తలచుకుంటే తమ దర్పాన్ని ఎలాగైనా ప్రదర్శించవచ్చు.