వైవాహిక జీవితంలో బయటకు చెప్పలేని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నందునే ఎంతోమంది అభాగినులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో బయటకు చెప్పలేని ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నందునే ఎంతోమంది అభాగినులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గర్భవతి అయిన భార్య ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పిన కర్ణాటక వాసికి ఆ రాష్ట్ర హైకోర్టు విధించిన ఐదేళ్ల జైలుశిక్షను తగ్గించేందకు మంగళవారం తిరస్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.
దురదృష్టకర పరిస్థితుల్లో 25 ఏళ్ల వయస్సుకే ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన బాధితురాలి కథ.. వైవాహిక జీవితంలో నాలుగ్గోడల మధ్య అనుభవించిన కష్టాలు, బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో అభాగినుల ఉదంతాలను గుర్తుకుతెస్తోందని పేర్కొంది. బాధిత యువతికి 1991లో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే 1993, నవంబర్‌లో తన భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు అతడు ఫిర్యాదు చేశాడు.