
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్, సోషల్ మీడియా దిగ్గజాలచే యూజర్ల సమాచారం బహిర్గతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించాలని, దేశంలోనే ఆయా సర్వర్లు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రధాని సూచించినట్టు అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఫేస్‌బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలు యూజర్ల సమాచారన్ని బహిర్గతం చేసిన అంశం ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఇంటర్‌నెట్ దిగ్గజాల సర్వర్లు భారత్‌లోనే ఉండాలని ప్రధాని సూచించారని సమాచారం.
దీనిపై ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం సమగ్ర సమీక్ష చేపట్టిందని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ సర్వర్లలో అత్యధికంగా యూజర్ల సమాచారం గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో నమోదవుతోంది. ఈ సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారం పొందాలంటే అమెరికన్ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి వ్యవహరించాల్సిమ ఉంటుంది. యూజర్ల సమాచారాన్ని స్ధానికంగానే భద్రపరచాలని, దీనిపై గట్టి నియంత్రణ ఉండాలని ప్రధాని చేసిన సూచనను ఐటీ మంత్రిత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. సమాచార రక్షణకు ప్రభుత్వం ఇతర మార్గాలనూ పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి.