కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ నేత యడ్యూరప్ప
సాక్షి, బెంగళూర్ : కాంగ్రెస్, జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని బీజేపీ నేత యడ్యూరప్ప అభివర్ణించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని విమర్శించారు. కర్ణాటక శాసనసభలో శుక్రవారం కుమారస్వామి సర్కార్‌పై విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు.
కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు.
కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రతిపక్షాలకూ అవకాశం ఇస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment