
తెలుగువారికి తమిళ నిర్భంధమా...
న్యూఢిల్లీ: తమిళనాడులో తెలుగు విద్యార్థుల పట్ల చూపిస్తున్న వివక్షను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంలోని తెలుగు సంఘాలు, ఢిల్లీలోని తెలుగు సంఘాల ఆధ్వర్యంలో 23వ తేదీన జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. 9వ తేదీన ఈ ధర్నా జరగాల్సి ఉండగా, చెన్నై నగరంలో వర్ష భీభత్సం కారణంతో వాయిదా వేసినట్టు చెప్పారు. సీపీఐ నేత నారాయణ, తమిళనాడులోని తెలుగు సంఘాల నేతలతో కలిసి ఏపీభవన్‌లో గురువారం వైఎల్పీ విలేకరులతో మాట్లాడారు.
భాషా అల్పసంఖ్యాకవర్గంగా ఉన్న తెలుగు, కన్నడ, మలయాళీ, ఉర్దూ భాష విద్యార్ధులకు అన్యాయం చేస్తూ 2006లో కరుణానిధి ప్రభుత్వం తెచ్చిన తమిళ నిర్భంధ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. మాతృ భాషలో చదువుకునే అవకాశం రాజ్యంగం కల్పించిందని, గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పు కూడా ఇచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయనున్నామని చెప్పారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలుగువారికి పిలుపునిచ్చారు. పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి చెన్నైలోని బాధితులకు వారం రోజుల పాటు సరుకులు కొనుగోలు చేసుకోడానికి నగదు ఇవ్వాలని విన్నవించారు.
ప్రేమలేఖలతో పని జరగదు : సీపీఐ నేత నారాయణ
తమిళ నిర్భంత చట్టాన్ని రద్దుచేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమలేఖలు రాస్తే సరిపోదని, జయ ప్రభుత్వంపై అందరూ కలిసి ఒత్తిడి తేవాలని సీపీఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. తెలుగు విద్యార్థుల పట్ల వైరుధ్యం చూపడం తగదన్నారు. తమిళనాడులోని తెలుగు విద్యార్థుల మనోభావాలు దెబ్బతీయకుండా జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్భంద చట్టాలు ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తే భావా స్వేచ్ఛకు ప్రమాదం వాటిల్లనుందన్నారు.