
మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. సీబీఐపై ప్రధాని మోదీకి పట్టు లేకపోవడంతోనే దర్యాప్తు ఏజెన్సీలో డ్రామాకు తెరలేచిందని ఆరోపించారు. అంతర్యుద్ధంతో వీధినపడ్డ సీబీఐని చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు చొరవ చూపిందని వ్యాఖ్యానించారు. రాఫెల్ ఒప్పందంపై విచారణకు అవరోధం కల్పించాలనే చౌకబారు రాజకీయ ప్రయోజనాలతో కేంద్రం సీబీఐలో చిచ్చుకు పూనుకుందని విమర్శించారు.
సీబీఐలో కేంద్రం జోక్యం చివరకు దర్యాప్తు ఏజెన్సీలో ఏవగింపు కలిగించే పరిణామాలకు దారితీసిందని ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో నలుగురు సుప్రీం న్యాయమూర్తులు సర్వోన్నత న్యాయస్ధానంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బాహాటంగా ముందుకొచ్చిన తరహాలోనే సీబీఐలో అంతర్యుద్ధం సైతం దేశ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.మరోవైపు రాఫెల్ ఒప్పందంతో మోదీ సర్కార్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రాఫెల్ డీల్‌పై విచారణకు విఘాతం కలిగించేందుకే సీబీఐలో విభేదాలను కేంద్రం ప్రోత్సహించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment