జవదేకర్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న శైలజా సుమన్
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాకు ప్రాచుర్యం కల్పించినందుకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ‘అంతర్జాతీయ యోగా దివస్ మీడియా సమ్మాన్’పురస్కారాలను 30 మీడియా సంస్థలకు ప్రకటించింది. ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ అవార్డులు అందజేశారు. రేడియో, టీవీ, ప్రింట్ మీడియా కేటగిరీల వారీగా మొత్తం 30 అవార్డులు అందజేశారు. రేడియో విభాగంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి ఈ అవార్డు దక్కింది. ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ మల్లాది శైలజా సుమన్ ఈ పురస్కారాన్ని మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రింట్ మీడియా విభాగంలో విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ‘సంచలన వార్త పత్రిక లీడర్’అనే తెలుగు వార్తా పత్రికకు ఈ అవార్డు లభించింది. ఈ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు వి.వి.రమణమూర్తి.. మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ‘యోగా దివస్’కు సంబంధించిన వార్తా కథనాలు 15 రోజులపాటు ప్రచురించడం వల్ల ఈ ఘనత దక్కిందని రమణమూర్తి తెలిపారు. 40 ఏళ్ల కిందట అనకాపల్లి ఆంధ్రజ్యోతి విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించానని, తాను స్థాపించిన ‘లీడర్’సాయంకాలం దినపత్రిక ఇటీవలే 20 ఏళ్ల ఉత్సవం జరుపుకుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment